అసెంబ్లీకెళ్లి ప్రజల సమస్యలపై పోరాడండి : చంద్రబాబు
సోమవారం నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలు, ప్రజల ఇబ్బందులపై పోరాడాలని సూచించారు. ఈమేరకు పార్టీ నేతలతో జూమ్ లో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. రెండు రోజుల కిందట జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో పార్టీ అధినేతతోపాటు మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పూర్తిగా బహిష్కరణ చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
సమావేశాలకు వెళ్లడమే సరైందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అసెంబ్లీ వేదికను కూడా వినియోగించుకోవాలని, మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడకు వెళ్లి పోరాటం చేయడమే మంచిదని వారు చెప్పారు. దానిని చంద్రబాబు కూడా ఆమోదించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. గతేడాది నవంబర్ లో జరిగిన సమావేశంలో తన సతీమణి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.
ఈ ప్రభుత్వం ఉన్నంత వరకూ తాను అసెంబ్లీకి రాబోనని, మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశారు. గౌరవసభను కౌరవసభగా వైసీపీ మార్చిందని మండిపడ్డారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న వేళ ప్రజల సమస్యలు ప్రస్తావించాలన్న అంశం పార్టీ నేతలు లేవనెత్తారు. దీంతో అసెంబ్లీకి వెళ్లాలని మెజార్టీ నేతలు భావించడంతో చంద్రబాబు ఓకే అన్నారు. అయితే టీడీపీ నిర్ణయంపై వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు సీఎం అయ్యేదాకా అసెంబ్లీకి రానని శపదం చేస్తే తన ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి వస్తామంటున్నారని విమర్శిస్తున్నారు.