గిద్దలూరు వైసీపీలో గలాట..!
రాష్ట్రంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్ మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం గిద్దలూరు. గిద్దలూరు చరిత్రలో అంత మెజారిటీ వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. 2014లో వైసీపీ నుండి ముత్తముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. తదనంతర పరిణామాలతో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అన్నా రాంబాబు వైసీపీ తీర్థం పుచ్చుకుని 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయధుందిబి మోగించారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు వైసీపీలో ముసలం రాజేసుకుంది. దీనికి కారణం ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరే కారణం అని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు.
ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తమకు సహకరించడం లేదని, కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. రాంబాబు పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మత మద్ధతు లభించదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా వైసీపీకి అంటీ ముట్టనట్లుగా రాంబాబు వ్యవహరిస్తున్నారు. తీవ్ర అసంతృప్తే దానికి కారణం అని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు దక్కలేదని రాంబాబు రగిలిపోయారని టాక్.
అంతేకాదు బయటకు వచ్చి ఆందోళన కూడా నిర్వహించారు. నేరుగా తాడేపల్లి పెద్దలతోనే తేల్చుకుంటానని చెప్పినప్పటికీ అది జరగలేదు. అధిష్టానమే అన్నాను పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు అశోక్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకుంటూ చేరికలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుండి అత్యధికంగా టీడీపీలో చేరిన నియోజకవర్గంగా గిద్దలూరును చెప్పుకుంటున్నారు. అశోక్ రెడ్డి స్పీడుతో, అన్నా తీరుతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డారని తెలుస్తోంది. అన్నా రాంబాబును మార్చితే అదే మెజారిటీతో వైసీపీని గెలుపు పీఠంపై కూర్చోబెడతామని స్థానిక నేతలు చెప్తున్నారు. ఇక ఏం జరుగుతుందో కొన్ని రోజులు ఆగాల్సిందే.