టీడీపీలో సీటు కోసం ఫైట్లు..ఎక్కడంటే..?
గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు వ్యూహాలు చేస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే టీడీపీ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. తాము గెలవగలమన్న నమ్మకం, పార్టీకి వస్తున్న ఆదరణ తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో పలువురు ఆశపడుతున్నారు. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల సీటు విషయంలోనే తీవ్రమైన పోటీ నడుస్తోంది. నెల్లిమర్ల టీడీపీకి కంచుకోట.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచడం వల్ల ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణ స్వామి నాయుడు కూడా అప్పలనాయుడు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. నారాయణస్వామి నాయుడు వయసు మీద పడటంతో ఇక్కడ ఇంఛార్జ్ పదవి కోసం పోటీ పెరుగుతోంది. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు వనజాక్షి, భోగాపురానికి చెందిన బంగార్రాజు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రావు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణస్వామి మనవడు తారకరామారావు కూడా ఇంఛార్జ్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
వనజాక్షి సోదరుడు ఆనంద్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే ఇంఛార్జ్ పదవి వరిస్తుందని అక్కడి వాసుల్లో టాక్ నడుస్తోంది. చంద్రబాబు పర్యటనకు ఘన స్వాగతం పలికిన బంగార్రాజు తనకే సీటు వస్తుందని ధీమాగా ఉన్నారని తెలుస్తోంది. అయితే పతివాడ నారాయణస్వామి ఎవరికి మద్ధతు తెలుపుతారో తెలియడం లేదు. ఎలాగైనా సీటు దక్కించేందుకు ఇక్కడి నేతలు అధినేత మనసును దోచుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇంఛార్జ్ పదవి ఎవరికి వస్తుందో మరికొన్ని రోజులు ఆగాల్సిందే