ఆడ పిల్లలకు రక్షణ కరువైంది : పవన్ కళ్యాణ్
విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే అఘాయిత్యానికి ఒడిగట్టడం.. అక్కడి నిఘా, సెక్యూరిటీ లోపభూయిష్టానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు.
మహిళల రక్షణ పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదన్న పవన్‌కల్యాణ్ దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రేపు చింతలపూడిలో పవన్ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష పరిహారం అందించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని,పర్యటనకు అడ్డంకులు సృస్టించాలని ప్రభుత్వం భావిస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
అందులో భాగంగానే పవన్ పర్యటించే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతుల పేరుతో జేసీబీలతో తవ్వేస్తున్నారని మండిపడ్డారు. జేసీబీలు తవ్వే ప్రాంతాలను స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అక్కడికి పెద్ద ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలు వచ్చి జేసీబీని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పవన్ పర్యటన నేపథ్యంలోనే ప్రభుత్వం పక్ష పూరితంగా వ్యవహరిస్తోందని జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.