ఉసిరితో ఇన్ని లాభాలున్నాయా..!
యువతతో పాటు పెద్ద వాళ్లు కూడా పోషకాహార లోపానికి గురై ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. అందుకనే డైట్‌లో పోషక ఆహార పదార్ధాలని తప్పక తీసుకోవాలి. అన్ని రకాల పోషక పదార్ధాలు, విటమిన్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఇమ్యూనిటీ పెంచడంలో విటమిన్ సి ది కీలకపాత్ర. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ సి ప్రాధ్యాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావల్సినంత విటమిన్ సి లభిస్తుంది. చాలావరకూ పండ్లు, కాయలు సీజన్ ను బట్టి లభిస్తాయి. ఏ కాలంలో ఏ పండ్లు తింటే మంచిదో దాని ప్రకారమే ప్రకృతి మనకందిస్తుంటుంది. చలికాలంలో ఎక్కువగా లభించే కాయల్లో ఉసిరికాయ ఒకటి .
ఉసిరి ఆరోగ్యానికి మంచి ఔషదం. చాలా రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టడానికి ఉసిరి బాగా ఉపయోగ పడుతుంది. సులభంగా మనం ఉసిరికాయల్ని తినవచ్చును లేదు అంటే ఉసిరి పచ్చడి వంటివి కూడా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఇది బాగా మేలు చేస్తుంది. అలాగే లివర్, బ్రెయిన్, ఊపిరితిత్తులు వంటి సమస్యలు కూడా ఇది దూరం చేస్తుంది. ఉసిరిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.