మా వాళ్లపై దాడులు చేస్తే మర్యాద దక్కదు : పవన్ కళ్యాణ్
వ్యవసాయాన్ని 80 శాతం కౌలు రైతులే చేస్తున్నారని, కౌలు రైతులను ఆదుకునేవారే లేరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కౌలు రైతులకు పరిహారం అందించిన అనంతరం చింతలపూడిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మట్లాడారు. కౌలు రైతుల సమస్యలను వైసీపీ ప్రభుత్వం గుర్తించాలని, కౌలు రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో 3 వేలకు పైగా కౌలు రైతులు చనిపోయారని, కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.3 లక్షలు అప్పు తీర్చలేక కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతుల కష్టాలపై మాట్లాడితే వ్యంగ్యంగా విమర్శిస్తారా అని ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ కొన్ని సూచనలు చేశారు.. వాటిని పాటిస్తానని, చర్లపల్లి షటిల్ టీమ్ కాదు.. చంచల్ గూడ షటిల్ టీమ్ అని తెలిసిందని ఎద్దేవా చేశారు.
‘‘చంచల్ గూడ జైలు నుంచి వచ్చినవారు కూడా నీతులు చెబుతారా? రైతుల కన్నీరు తుడుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే గ్రామసచివాలయాలు ఎందుకు? సీబీఐ దత్తపుత్రుడి మాటలను పట్టించుకోను. జనసేన కార్యకర్తలపై గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మా వారిపై దాడులు చేసే వైసీపీ నేతలకు ఇకనుంచి మర్యాద దక్కదు. పచ్చని గోదావరి జిల్లాల్లోనూ ఆత్మహత్యలు జరగడం దారుణం. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. హామీ ఇచ్చిన రూ.13,500ను రైతులకు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన రూ.6 వేలు కాకుండా రూ.13,500 ఇవ్వాలి.
జనసేన తరపున ప్రతి కౌలు రైతునూ ఆదుకుంటాం. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా నిలవాలి. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కౌలురైతు కుటుంబానికి పరిహారం అందేలా చూస్తాం. ప్రభుత్వ సొమ్ము ఎప్పుడైనా బ్యాంకు ద్వారా ఇవ్వాలి కదా? పోలీసులు బానిసలని వైసీపీ నేతలు అనుకుంటున్నారా?. యువత బాధ్యత తీసుకోకుంటే సమాజంలో మార్పు రాదు. పరిశ్రమలు వస్తేనే కదా యువతకు ఉద్యోగాలు వచ్చేది. మద్యపాన నిషేధమని చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ మీరే మద్యం దుకాణాలు ఎలా పెడతారు?. కళ్లముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండలేను’’ అని అన్నారు.