సవాల్ ను స్వీకరిస్తున్నా.. చర్చకు రా లోకేష్ : విజయసాయిరెడ్డి.
పదవ తరగతి ఫలితాలపై లోకేశ్ సవాల్ ను స్వీకరిస్తున్నామని, లోకేష్ చర్చకు రావాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. పది ఫలితాలపై బహిరంగ చర్చకు లోకేష్ వస్తే తాము సిద్ధమని ప్రకటించారు. గురువారం లోకేష్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టామని, అది కేవలం ప్రారంభం మాత్రమే అన్నారు. పాస్ పర్సంటేజ్ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉండదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలను అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు.
లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. లోకేష్ జూమ్ మీటింగుకి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారని, అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్ధమౌతుందున్నారు. ఈ విషయాలను ప్రశ్నించటానికి పార్టీ నేతలు జూమ్ మీటింగ్ లోకి వెళ్లారన్నారని వివరణ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ లు బుద్ది మార్చుకోకపోతే తామే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పది ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటని ప్రశ్నించారు.
కుసంస్కారంతో తమ నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించాలని కోరారు. చంద్రబాబు వచ్చినా సరే చర్చకు తాము సిద్దమన్నారు. జూమ్ మీటింగ్ లో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. విజయసాయి వ్యాఖ్యలకు అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. దొంగ లెక్కలు రాసి ఊచలు లెక్కటిన నువ్వు సవాల్ విసరడం ఎంటి సాయి రెడ్డి.. నీ రేంజ్ కి మా ఆఫీస్ లో అటెండర్ చాలు అని ఘాటుగా విమర్శించారు. లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్ తో అని, మీ వాడి లో దమ్ముంటే చర్చకు రమ్మనాలని, ఎనీ బ్లూ మీడియా లోకేష్ ఈజ్ రెడీ అంటూ ట్వీట్ చేశారు.