అవినీతిని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు: వీ.ఎస్.యూ వీసీ వీరయ్య
November 6, 2016
విక్రమ సింహపురి యూనివర్సిటీలో అవినీతి అంతం పై చర్చావేదిక కార్యక్రమం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు వీ.ఎస్.యూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. వీ.ఎస్.యూ కళాశాల సెమినార్ హాల్ లో కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య వి.వీరయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో చైతన్యం కలగనంతవరకు ఉపయోగం లేదన్నారు. ప్రజలే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విద్యార్థి దశ నుండే పోరాటాలు జరిపి ఈ అవినీతి భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ తోట ప్రభాకర్ మాట్లాడుతూ ఆడంబరాలకు అలవాటుపడి కొంతమంది అధికారులు పేద ప్రజలను దోచుకుతింటున్నారని తెలిపారు. తమ దృష్టికి అవినీతి పరుల వ్యవహారాన్ని తీసుకురావాలని తప్పకుండా చర్యలు చేపట్టి శిక్షిస్తామని తెలియజేసారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణాచలం మాట్లాడుతూ సమాజం లోని అవినీతిని కూకటివేళ్లతో పీకేయాలని, అది విద్యార్థి దశ నుండే అలవడాలని తెలిపారు. వీ.ఎస్.యూ రిజిస్ట్రార్ పీఆర్ శివశంకర్ మాట్లాడుతూ అవినీతిని ప్రజలు ప్రోత్సహిస్తున్నందువల్లే అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. సమావేశంలో వీ.ఎస్.యూ వైస్-ప్రిన్సిపాల్ అందె ప్రసాద్, అధ్యాపకులు నరసింహారావు, పవర్ గ్రిడ్ సంస్థ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.