రేపటి నుండి చంద్రబాబు జిల్లాల పర్యటన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు. అదేరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీమహానాడుకు హాజరవుతారు. 16వ తేదీన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తారు. టీడీపీ అధినేత రెండు రోజుల జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.
రెండు గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు చోడవరం వెళతారు. శివాలయం గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనుల కోసం గతంలో సీఎం హోదాలో తాను ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శిస్తారు. అనంతరం మినీమహానాడు సభా వేదిక వద్దకు వస్తారు. సభలో ప్రసంగించిన అనంతరం ఏడు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 7.45 గంటలకు అనకాపల్లి చేరుకుంటారు. రాత్రికి చంద్రశేఖర కల్యాణ మండలంలో బస చేస్తారు.
గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ మార్కెట్ యార్డు రోడ్డులో నూతనంగా నిర్మించిన టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ కార్యాలయానికి చేరుకొని ప్రారంభిస్తారు. 11 గంటలకు తిరిగి చంద్రశేఖర కల్యాణ మండపానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అసెంబ్లీ నియోజవర్గాల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి గాజువాక, ఎన్ఏడీ జంక్షన్ మీదుగా విజయనగరం వెళతారు. నెలకు రెండు జిల్లాల చొప్పున పర్యటించి, మహానాడులో పాల్గొననున్నారు.