వారసత్వ రాజకీయాలకు చరమగీతం : జేపీ నడ్డా
దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్తోందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని అందరూ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. అందుకే మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారని అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో నడ్డా ప్రసంగించారు. ‘‘2014 వరకు భారత దేశ స్వరూపం ఎలా ఉండేదో మీకు తెలుసు. విద్యుత్తు, విద్య, ఆరోగ్య వసతులు లేని భారతదేశం ఉండేది. గ్రామాలను కలిపేందుకు సరైన రహదారి వసతులు కూడా ఉండేవి కావు. పేపర్లలో ఎక్కడా చూసినా అవినీతి, పక్షపాతానికి సంబంధించిన వార్తలే ఉండేవి.
మోదీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు వచ్చాయో మీకు తెలుసు. దేశం అభివృద్ధి పథంలో ఎంతో ముందుకు దూసుకెళ్లింది. ఓటు బ్యాంకు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న నినాదంతో మోదీ ముందడుగు వేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఉగ్రవాదాన్ని కూడా అదుపుచేసి.. యువకులను జనజీవన స్రవంతిలోకి తెచ్చారు. వన్ నేషన్.వన్ రేషన్ ఇలా దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం.
ఇప్పుడు దేశంలో బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 70 కోట్లు . గ్రామీణ ప్రాంతాలకూ ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొచ్చింది బీజేపీనే. ఇదంతా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. దేశం నుంచి 500 మిలియన్ డాలర్ల ఎగుమతులు. అటల్ పింఛన్ యోజన కింద రెండు కోట్ల మందికి లబ్ధి. అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు అందించే పథకం చేపట్టాం. పీఎం ఆవాస్ యోజన కింద 2.5 కోట్ల ఇళ్ల నిర్మాణం. దేశంలో అక్షరాస్యత శాతం 69 నుంచి 75కు పెరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాం. దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి’’ అని అన్నారు.