స్టాలిన్ చేయని పనిని జగన్ చేశారు : చంద్రబాబు
రాష్ట్రంలో ఉన్న కల్తీ బ్రాండ్ల దెబ్బకి కొందరు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వంటనూనె, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గం పోగూర్పల్లి గ్రామంలో రెండో రోజు పర్యటించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. గ్యాస్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ.330 వసూలు చేస్తోందని, రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తానని చెప్పి.. రూ.6 వేలు ఇచ్చారని విమర్శించారు. ఒకే విడతలో రూ.50 వేలు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని గుర్తు చేశారు. రైతులకు ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఇచ్చామని తెలిపారు.
జగన్ బటన్ నొక్కితే ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు పడట్లేదని, విద్యార్థులకు ఎవరికీ ఉపకారవేతనాలు రావట్లేదని ఆరోపించారు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ తొలగించలేదని, జగన్ మాత్రం ఏపీలో అన్న క్యాంటీన్లను తొలగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనే లేదని, పెట్టుబడులన్నీ పారిపోయే పరిస్థితి ఉందని అన్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టారు అని, రైతులు ఇప్పటికే చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త మీద చెత్త పన్ను వేసిన ఏకైక సీఎం జగనేనని, వైసీపీది విధ్వంస పాలన అని అన్నారు. జగన్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని, పోలీసుల అలసత్వం వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయని విమర్శించారు. యువతకు జాబులు రావాలంటే టీడీపీయే అధికారంలోకి రావాలని, యువత ఏకపక్షంగా టీడీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.