రైతులకు బోరు, మోటారు, పైపులు ప్రభుత్వమే ఇస్తుంది : సీఎం జగన్

చెరువులను కాలువల ద్వారా  అనుసంధానం చేసే దిశగా పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.  రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేయగలిగితే… నీటిఎద్దడిని నివారించగలుగుతామని సీఎం అభిప్రాయపడ్డారు. సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని, ప్రతిచోటా నవరత్నాలు ఫోటో ఉండేలా చూడాలని ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయని,  అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని,  భవన నిర్మాణ పనులు ఆగకూడదు… అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఉపాధి హామీ పనులుకు సంబంధించి… బిల్లులు అప్‌లోడ్‌ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదని,  ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలన్నారు.  వైఎస్‌ఆర్‌ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుందని,  ఈ పథకం కింద నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలని ఆదేశించారు.

175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలని, దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామని అధికారులు తెలపగా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామన్న సీఎం తెలిపారు.  బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు రైతు అకౌంట్‌కు నేరుగా (డీబీటీ విధానంలో) జమ చేసి.. .అతని నుంచి పేమెంట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల లంచాలు లేని వ్యవస్ధను తీసుకురాగలుగుతామని,  దానికి తగిన విధంగా ఎస్‌ఓపీలు రూపొందించాలని తెలిపారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *