దగాకోర్లకు పాలకులు అండగా ఉంటారా.?: చంద్రబాబు
రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకూ రక్షణ లేదని, ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆడబిడ్డలపైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదున్నారు. సీఎం జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, తన కూతురు కనపడటం లేదని బాధితురాలి తండ్రి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. కుటుంబ సభ్యులనే వెతుక్కోమని చెప్తారా? అని ప్రశ్నించారు. ఎంతమంది ఆడ బిడ్డలపైన అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం మేల్కొంటుందని మండిపడ్డారు. విజజయవాడ సర్వజన ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని చంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘దగాకోర్లకు పాలకులు అండగా ఉంటారా? ప్రభుత్వ తీరుతో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. మరో రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయిని పల్నాడులో అత్యాచారం చేశారు. పల్నాడు ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు? వైసీపీ ప్రభుత్వానికి పరిపాలించే అర్హతలేదు. సీఎం తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడం. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని తగలబెడతారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దోషులకు ఉరిశిక్ష వేయండి. బాధితురాలి కుటుంబానికి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి ఘటన రాష్ట్రానికే అవమానం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. జే బ్రాండ్లతో నాసిరకం మద్యం విక్రయాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ను అడ్డగా మార్చారు. ప్రజలు భయపడితే సాధించేదేమి ఉండదు. మనల్ని మనం కాపాడుకునేందుకు పోరాటం చేయాలి. బాధితుతాలు గౌరవప్రదంగా బతికేందుకు అండగా ఉందాం. దిశ లేదు.. దిశ యాప్ లేదు. లేని దాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారు. బాధితురాలి వద్దకు ముఖ్యమంత్రి రావాలి. బాధితురాలికి రూ.కోటి, ఇల్లు, ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.