ఒంగోలులో మహానాడు..మే నుండి జిల్లాల పర్యటన : టీడీపీ అధినేత చంద్రబాబు
ఒంగోలులో మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మంగళవారం చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదన్నారు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు…పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరన్నారు. టీడీపీ అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీ ప్రజలు గుర్తించారు…తాము ఏం నష్టపోయామో వారికి తెలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు…జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి అని విమర్శించారు.
ఇంకా ఏమన్నారంటే..‘‘ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడు. మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతుంది…ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుంది. మైనింగ్, ఇసుక ను సంపూర్ణంగా దోచుకుంటున్నారు….ఈ భారం ప్రజపైనే పడుతుంది. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసీపీకి పడే చాన్స్ లేదు. రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి…ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారు. రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు….కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు.
పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టీడీపీపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారు. జగన్ లో అపరిచితుడు ఉన్నాడు….జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదు. వైసీపీ ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనేదే జగన్ ఫ్రస్టేషన్ కు కారణం. జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారింది…..క్యాబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయింది. ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారు…..దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయి. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతాను. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తాను’’ అని అన్నారు.