దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ
January 6, 2017
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయం పర్యావరణ అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ గురువారం దామవరంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ విమానాశ్రయ ఏర్పాటుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ (ప్రజా ఆస్తులకు సంబంధం లేని ఎటువంటి లిటిగేషన్ లు లేని ప్రభుత్వ భూములు) విమానాశ్రయం కోసం దామవరం, కౌరుగుంట పంచాయితీలలో ఇప్పటికే 1399 ఎకరాల భూసేకరణ జరిగిందన్నారు. కోర్టు కేసుల కారణంగా పలువురికి పరిహారం చెల్లింపులో జాప్యం జరిగిందని, సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మన రాష్ట్రంలో దగదర్తి, ఓర్వకల్లు, భోగాపురం, కుప్పం, నాగార్జునసాగర్ లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయనుందని ఈ నిర్మాణాల సందర్భంగా పర్యావరణ ప్రభావం గురించి ప్రజలకు తెలియపరచి అందరి అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయానికి ఇప్పటికే రక్షణ మంత్రిత్వశాఖ, పౌర విమానయాన శాఖ అనుమతులు వచ్చాయని భోగాపురం విమానాశ్రయ ఎండీ వెంకటేశ్వర్లు అన్నారు.
దామవరం సర్పంచి శీనయ్య మాట్లాడుతూ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాజీ సర్పంచి ప్రసాద్ మాట్లాడుతూ భూములు కోల్పోయిన వారికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. సామాజిక కార్యకర్తలు మురళి, మధు తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో లక్ష్మీ నరసింహం, తహసిల్దార్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.