గుడిని..గుడిలో లింగాన్ని మింగే రకం వెల్లంపల్లి : బుద్ధా వెంకన్న
అవినీతి ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగమింగిన రూ.1524కోట్లను ఎప్పుడు కక్కిస్తారో జగన్ రెడ్డి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. దేవాదాయమంత్రిగా ఉండి గుడిని, గుడిలో లింగాన్ని మింగి కొబ్బరిచిప్పల మంత్రిగా వెల్లంపల్లి పేరుప్రతిష్టలు పొందాడని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లి అవినీతి, దోపిడీకి సంబంధించి ఆధారాలతో ప్రజలముందు బహిరంగంగా చర్చించేందుకు తాముసిద్ధమన్నారు. ఎలాంటి అవినీతి చేయలేదని జనంలోకి వచ్చి చెప్పే ధైర్యం దేవాదాయశాఖ మంత్రికి ఉందా? అని ప్రశ్నించారు. అలీబాబా 40దొంగల గురించి విన్న ప్రజలంతా.. ఇప్పుడు జగన్ బాబా 25దొంగల పనితనం గురించి తెలుసుకుంటే కళ్లు బైర్లుకమ్ముతున్నాయన్నారు.
ఈ 25 మంది దొంగలు ప్రజల్ని లూఠీచేసి, రాష్ట్రాన్ని కుక్కులుచింపినవిస్తరి చేశారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. జగన్ సహా వైసీపీ నేతలంతా కుక్క తోక వంకరన్నట్లుగా సిగ్గూశరం లేకుండా యథేచ్ఛగా మూడు లూఠీలు, ఆరు దోపిడీలు అన్నట్లుగా వ్యవహరించారన్నారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి నుంచి వాలంటీర్ల వరకు దోచుకున్నది దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. మంత్రులు దొరికిందే ఛాన్స్ అన్నట్లు తరతరాలకు సరిపడా దోచుకున్నారని, వెధవలకు పదవులు ఇస్తే ఎలాఉంటుందో చెప్పడానికి వెల్లంపల్లి శ్రీనివాసే పెద్ద ఉదాహరణ అని మండిపడ్డారు.
కొబ్బరిచిప్పలు అమ్ముకునే దశ నుంచి కోట్లకు పడగలెత్తిన వెల్లంపల్లి కథా ప్రజలంతా నోరెళ్లబెట్టాల్సిందేనన్నారు. వెల్లంపల్లి మంత్రి కాకముందే వినాయకుడి సొమ్ము కాజేశాడని ఆరోపించారు. ఆ పనితనం చూసే శ్రీనివాస్ కు జగన్ బాబా దేవాదాయశాఖ కట్టబెట్టాడనిపిప్తోందన్నారు. దొంగలను బ్యాంకుకు కాపలా పెట్టినట్టు దోపిడీ దారుడికి దేవాదాయశాఖ కట్టబెట్టారని ఆరోపించారు. దేవుడనే భయంకూడా లేకుండా, తనకు మంత్రిపదవి ఇచ్చారన్న ఆనందంతో పదింతలు దోపిడీకి పాల్పడ్డాడని విమర్శించారు. బీజేపీలో చేరక ముందు టీడీపీలో చేరడానికి వెల్లంపల్లి ప్రయత్నిస్తే చంద్రబాబు దగ్గరకు రానివ్వనని చెప్పడంతో ముఖం చాటేశాడని వివరించారు.