పోలవరాన్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్
పోలవరం ప్రాజెక్టు పనులను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో పోలవరం పనులు వేగంగా జరిగాయని తెలిపారు. వైఎస్ఆర్ హయాంలోనే 75 శాతం భూసేకరణ జరిగిందని వివరించారు. సవరించిన అంచనాలు అడిగితే అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేసిందని మండిపడ్డారు. ప్యాకేజీ వచ్చిందని గత టీడీపీ ప్రభుత్వం సంబరాలు చేసుకుందన్నారు.
కానీ ప్రజలు ఎంత నష్టపోతున్నారో చంద్రబాబు గుర్తించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది లేకపోవడంతో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ తో తాము ప్రజా ధనాన్ని ఆదా చేశామని తెలిపారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా మా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్ట్ 48 గేట్లను తమ హయంలోనే అమర్చామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పనులను ఆపలేదని ప్రకటించారు. చంద్రబాబు తన భజన కోసం వంద కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా పనులు జరిగాయన్నారు. ఎల్లో మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని, ముమ్మాటికీ పోలవరం పూర్తి చేసి నీళ్లిస్తామని ఉద్ఘాటించారు. జలయజ్ణంతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయాలని రాజశేఖర్ రెడ్డి కలలు కన్నారనతి తెలిపారు. రాజశేఖర్ ఆశయాలను తనయుడు జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 2023నాటికి పోలవరం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.