పీకే ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి
తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నుండి పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా ఓడిస్తానని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి పవన్ కల్యాణ్ నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ ను విమర్శించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇంచార్జిగా వ్యవహరించేందుకు బాధ్యత తీసుకుంటానని కూడా చెప్పారు. పవన్ పోటీ చేసే చోట ఓడిస్తానని సవాల్ చేశారు.
జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ అన్యాయం చేస్తున్నారని, జనసేన పార్టీని ప్యాకేజీ కోసం తాకట్టు పెడుతున్నారని.. జన సైనికులు బాధపడే రోజు వస్తుందని జోష్యం చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని, పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి పార్టీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నానని అన్నారు. ద్వారంపూడి వ్యాఖ్యలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎ
మ్మెల్యే ద్వారంపూడి మాటలు విని తనకు చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదన్నారు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నాం కదా అని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటేనని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలే ఓటుతో బుద్ధి చెబుతారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు