జగన్ పాలనలో ఏమి కోల్పోయారో చెప్పారు : జగన్ బావ బ్రదర్ అనిల్
వివేకానందరెడ్డి హత్యలో దోషులు తప్పించుకోలేరని, సీబీఐ నిష్పాక్షిపాతంగా దర్యాప్తు చేస్తోందని జగన్ బావ, క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నేతలతో భేటీ అయ్యారు. హత్య కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన న్యాయం జరగడంలేదని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం కృషి చేసిన సంఘాలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు.
వాళ్ల గోడు వినేందుకే ఉత్తరాంధ్ర వచ్చానట్లు తెలిపారు. దీనిపైన సీఎం జగన్ కు త్వరలో లేఖ రాస్తానని చెప్పారు.
పార్టీ పెట్టాలంటూ అన్ని సంఘాల వారు తనను కోరుతున్నారని, పార్టీ పెట్టడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. పార్టీ పెట్టడమనేది అత్యంత క్లిష్టమైన విషయం అని, దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వస్తోందన్నారు.
సీఎం జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందని, ఆయన అపాయింట్ మెంట్ కోరడంలేదన్నారు. జగన్‌ను కలవాలంటే… తనకు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, అయితే.. ఓ పద్దతి ప్రకారం చేయాలి కాబట్టి చేస్తున్నట్లు తెలిపారు. అంశాల వారీగా అందరితో చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఇంకా ఏం చర్చించారో పూర్తి సమాచారం తెలియదు. ఇటీవల రాజమండ్రిలో మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సైతం అనిల్ సమావేశమయ్యారు. జగన్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా.? లేక టీడీపీకి అనుకూలంగా ఉన్న బీసీలను చీల్చేందుకు రహస్య సమావేశాలు జరుపుతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.