కావాలంటే టేపు తెచ్చుకుని కొలుసుకోండి : మంత్రి అనిల్
2014 నాటికి పోలవరం 32 శాతం పూర్తయిందని, ఆ తర్వాత మూడేళ్లపాటు తట్టెడు మట్టిని టీడీపీ ప్రభుత్వం వేయలేదని నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పోలవరం పూర్తి కాకుండానే రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించారని మండిపడ్డారు. 2017 ఫిబ్రవరిలో 50 వేల ఇళ్లను తరలిస్తే సరిపోతుందని కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని విమర్శించారు. శాసనసభలో టీడీపీ నిమ్మల రామానాయుడు క్వశ్చన్ అవర్లో మాట్లాడారు. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించేస్తున్నారనే అపోహలు రైతుల్లో నెలకొన్నాయని, నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
దీనిపై మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాధాన మిచ్చారు. డ్యామ్ కట్టిన తర్వాత ఒకేసారి పూర్తిస్థాయి నీళ్లు నిలబెట్టరని, దానికి ఒక ప్రొటోకాల్ ఉంటుందని వివరించారు. ముందుగా మూడింట ఒక వంతు, ఆ తర్వాత 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లి 190 టీఎంసీల స్థాయికి పెంచుతామని విరించారు. ఇప్పటికే ఎనిమిది వేల ఇళ్లను తరలించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఒక్క పునరావాస కాలనీౖ నైనా నిర్మించి, ఒక్క కుటుంబానికైనా పునరావాసం కల్పించారా? అని ప్రశ్నించారు.
పోలవరం డ్యామ్ ఎత్తు అంగుళం కూడా తగ్గించడం లేదని, కావాలంటే టేపు తెచ్చుకుని కొలుచుకోవచ్చునని సవాల్ విసిరారు. అయితే పోలవరంపై చర్చ జరుగుతున్న సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ రామానాయుడు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరువురు మధ్య జరుగిన వాదన అందరినీ తమవైపే చూసేలా ఆకర్షించింది. అసెంబ్లీలో బాగా మాట్లాడారని ఇదే తంతును టీడీపీ ఎమ్మెల్యేలు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు టీడీఎల్పీ సమావేశంలో సూచించినట్లు సమాచారం.