అతనిపై చర్యలు తీసుకోండి..లోక్ సభ స్పీకర్ కు వివేకా కుమార్తె లేఖ
మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో కీలక మలుపు తిరుగుతున్న తెలిసిందే. ఈ కేసు చివరకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. అవినాష్ కు వ్యతిరేకంగా ఇప్పటికే పలువురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ కుటుంబ సభ్యులు సైతం అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉందని మొదటి నుండి వివేకా కూతురు సునీతారెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఆమె చొరవతోనే సీబీఐ విచారణ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఓలేఖ రాశారు. ‘మా తండ్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉంది. దయచేసి అతడిపై చర్యలు తీసుకోండి. నేను సీబీఐకి కూడా ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చాను. ఆ కాపీని మీకు సమర్పిస్తున్నాను’ అంటూ ఆమె రాసిన లేఖలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారింది. స్పీకర్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.
మరో వైపు వివేకానందరెడ్డి హత్యను తొలుత ఎంపీ అవినాష్ రెడ్డి గుండెపోటుగా చిత్రీకరించే యత్నంచారని సీబీఐ చేసిన విచారణలో తేలింది. సాక్ష్యాలు చెరిపేసేందుకు కూడా ఆయన యత్నించినట్లు సీబీఐ ఆధారాలు సేకిరించింది. దీంతో ఈ కేసులో ఏ క్షణమైనా అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ హత్యకేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.