జగన్ పై పోటీ అతనే..తేల్చి చెప్పిన చంద్రబాబు..!
2024 ఎన్నికల్లో పులివెందుల నుండి ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి)నే పోటీ చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అయితే పులివెందుల నేతలతో కాస్త ఆలస్యంగా సమావేశమైన చంద్రబాబు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కడప జిల్లా వైసీపీకి ఎలాంటి కంచుకోటో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టీడీపీకి రాలేదు. గత ఎన్నికల్లో పార్టీ పరాభవమైనప్పటికీ పులివెందుల, జమ్మలమడుగు పార్టీ బాద్యతలను బీటెక్ రవి భుజానికి వేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో జెండా పాతాలన్న కసితో ఇటు అధినేత, అటు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసమే చకచకా సమావేశాలు పెట్టి ఇంఛార్జ్ లను నియమిస్తున్నారు చంద్రబాబు. అయితే ఇది వరకు జగన్ పై పోటీ చేసిన సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తారని కొందరు ప్రస్తావించారు. దీనిపైస్పందించిన అధినేత ఎవరొచ్చినా పులివెందుల నుండి బీటెక్ రవి మాత్రమే పోటీ చేస్తారని తేటతెల్లం చేశారు. కడప జిల్లా నుండి త్వరలో చేరికలు ఉంటాయని, అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
కిందిస్థాయి నుండి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను నేతలు, కార్యకర్తలకు వివరించారు. అయితే జిల్లాలో తమకు సానుకూల ఫలితాలు వస్తాయని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. సొంత జిల్లా కడపను సీఎం పట్టించుకోవడంలేదని, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. త్వరలో వివేకా హత్య కూడా తేలుతుందని, ఇదివైసీపీకి పెద్ద మైనస్ గా మారుతుందని తేల్చి చెప్తున్నారు. అయితే పులివెందుల్లో జగన్ ను ఢీకొట్టి, వైఎస్ కంచుకోటను టీడీపీ టచ్ చేయగలుగుతుందోమే తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.