కాపు నేత ముద్రగడతో జీవీఎల్ భేటీ..త్వరలో
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కిర్లంపూడిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మనాభం సమక్షంలో కాపు జేఏసీ నేతలతో సుమారు రెండు గంటల పాటు చర్చించారు. కాపు ఉద్యమం గురించి జీవీఎల్ ముద్రగడను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమ వివరాలను గురించి వివరాలు సేకరించారు జీవీఎల్. కాపుల న్యాయమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించాలని జీవీఎల్ కోరారు.
పద్మనాభంతో రెండు గంటల పాటు చర్చల అనంతరం మీడియాతో నరసింహారావు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల కోసం కాపులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారని తెలిపారు. కాపుల రిజర్వేషన్ అంశం గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో బిల్లు చేసి పార్లమెంట్‌కు పంపించిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు.
బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కాపు రిజర్వేషన్.. ప్రస్తుతం లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే కాపుల రిజర్వేషన్ అంశం ఉందని పేర్కొన్నారు.
కాపు రిజర్వేషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనేదనని.. కాపు సామాజిక వర్గం ఏ కులానికి అన్యాయం చేయాలని.. పోటీ పడాలని కోరుకోవడం లేదంటూ జీవీఎల్ స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్.రాజశేఖరరెడ్డి తమపార్టీ మేనిఫెస్టోలో రెండు దఫాలుగా కాపులకు రిజర్వేషన్ పెట్టిన అంశాన్ని చేర్చారన్నారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపులకు న్యాయం చేయాలని జీవీఎల్ కోరారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లకు అదనంగా రిజర్వేషన్లు కల్పించాలని మాత్రమే కాపులు కోరుకుంటున్నారని జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ముద్రగడను బీజేపీలోకి రావాలని కోరిన జీవీఎల్ ఆహ్వానాన్ని సున్నితంగా ముద్రగడ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో మరోసారి రిజర్వేషన్లపై చర్చిద్దామని జీవీఎల్ ముద్రగడతో అన్నారు.కాపులను బీజేపీ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముద్రగడ బీజేపీలో చేరతారా..కాపు నేతగా మిగిలిపోతారా అన్నది తేలాల్సి ఉంది.