ఆ మామిడి ధర @ RS.31 వేలు.. ఎందుకంటే?
పండ్లలో రారాజు మామిడి. ఈ పండును ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. మండువేసవిలో… ఈ మధురమైన పండ్లను ఆస్వాదిస్తే… అబ్బో మాటల్లో వర్ణించలేం. కచ్చా మామిడికి కాసింత ఉప్పు, కారం పట్టించి కొరికి తింటే… వావ్..! ఇక చెట్టుమీద పక్వానికి వచ్చిన పండును జుర్రితే ఆ మజానే వేరు. ఇంతటి మధురమైన మామిడి ధర మహా అంటే కిలో రెండు రూ.200. అంతకు మించిన ధర ఉండదు అని అనుకుంటాం. ఇక ఓ పెట్టే ధర దాదాపు రూ.2 వేల నుంచి మూడు వేల వరకు పలుకుతుంది. కానీ ఓ మామిడి పెట్టె ధర మాత్రం ఏకంగా రూ.31 వేలు ఖరీదు చేసింది.
మహారాష్ట్రలోని పుణెలోని ఓ మామిడి పెట్టె ధర రూ.31 వేలు పలికింది. ఆ మామిడి పండ్లు దేవ్ గఢ్ ప్రాంతం నుంచి రావడమే అందుకు కారణం. సహజంగా దేవ్ గఢ్ లో పండే పండ్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే యాభై ఏళ్లలోని మామిడి మార్కెట్ లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. మరోవైపు కరోనా కారణంగా మామిడి నిల్వలు కూడా తగ్గిపోయాయి. అందుకే వ్యాపారులు ఇప్పటి నుంచి మామిడి వ్యాపారులు షురూ చేశారు. తమ వ్యాపారం బాగా సాగాలని ఇప్పటి నుంచే సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి మామిడి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయని వర్తకులు చెబుతున్నారు.
పుణెలో మామిడి పండ్లకు పూజలు చేస్తారు. సీజన్ లో వచ్చే తొలి పండ్లకు ప్రత్యేక పూజ చేస్తారు. తమ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటారు. మామిడి పండ్ల పెట్టెకు పూల దండలు వేస్తారు. అనంతరం వేలం పాట నిర్వహిస్తారు. ఇక సరుకు, ప్రత్యేకతను బట్టి… ధర నిర్ణయిస్తూ… పండ్లను ఖరీదు చేస్తారు. అయితే ఈసారి ఓ పెట్టె రూ.31 వేలు పలకడం గమనార్హం.