వీ.ఎస్.యూ ని నూతన భవనం లోకి మార్చండి – రిజిస్ట్రార్ శివశంకర్ ను తొలగించండి: ABVP
November 16, 2016
సంవత్సర కాలం క్రితం నిర్మాణాలు పూర్తై చేరడానికి సిద్ధంగా ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ నూతన భవనాల్లోకి వర్శిటీని మార్చకుండా తాత్సారం చేస్తున్నారని వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ ABVP వీ.ఎస్.యూ విద్యార్ధులు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ABVP వర్శిటీ విభాగం అధ్యకులు సాంబశివారెడ్డి, కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్శిటీని నూతన భవనం లోకి మార్చకుండా ఆలస్యం చేస్తూ అద్దె భవనాలకు లక్షల రూపాయలు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా దీనిపై పోరాడుతున్నా వర్శిటీ అధికారుల నుండి కనీస స్పందన కరువైంది అని అన్నారు. వర్శిటీ మార్పు పై లిఖితపూర్వక ప్రకటన ఇచ్చే వరకు దీక్షను విరమించేది లేదన్నారు. అదేవిధంగా వర్శిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఇక్కడి అవినీతి అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలన్నారు. విద్యార్ధుల మెస్ ఛార్జీల తగ్గింపు మరో డిమాండ్. వర్శిటీ కి యూ.జి.సి. 12 బి హోదా గుర్తింపు ఎప్పుడు వస్తుందని, అనేక అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన అవినీతి రిజిస్ట్రార్ శివశంకర్ ను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తున్నదని తక్షణం తొలగించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ ABVP ఉపాధ్యక్షులు జయచంద్ర, ఇన్ ఛార్జి ప్రతాప్, జిల్లా కో-కన్వీనర్ కౌషిక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.