వీధి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పడతామన్న నగర మేయర్ అబ్దుల్ అజీజ్
February 10, 2017
నెల్లూరు నగరంలో తోపుడు బండ్లపై టిఫిన్, ఇతర వ్యాపారాలు నిర్వహించేవారు, బుట్టలలో పండ్లు, పూలు, కూరగాయలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటి వివిధ వ్యాపారాలు చేసుకునే పలువురు మహిళా వీధి వ్యాపారాలు శుక్రవారం నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ను కార్పొరేషన్ కార్యాలయం లో కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ నగర వ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులందరికీ స్ట్రీట్ వెండర్ షిప్ రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. రిజిష్ట్రేషన్ పొందినవారికి ముద్ర పధకం ద్వారా 50 వేల రూపాయల బ్యాంకు రుణం అందించి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతామని వివరించారు. చిరువ్యాపారులకు అనునిత్యం ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా వారి వ్యాపారాలకు అనువైన ప్రాంతాలను నగరంలో ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. నూతనగా డిజైన్ చేసిన తోపుడు బండ్లను చిరు వ్యాపారులకు అందజేసి వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. పెట్టుబడి, మూల సరుకు కొనుగోలుపై వారికి అవగాహన పెంచి, వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వపరంగా అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.