వి.ఎస్.యూ పాలకమండలి సభ్యుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ శివశంకర్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వర్శిటీ డ్రైవర్ ఆములూరు ప్రసాద్ వర్శిటీ పాలకమండలి సభ్యులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక అంబేద్కర్ భవన్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు.
వివరాల్లోకి వెళ్తే ఆములూరు ప్రసాద్ విక్రమ సింహపురి యూనివర్సిటీలో గత కొన్నేళ్ళుగా శాశ్వత డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. దళిత కులానికి చెందిన ప్రసాద్ విధులను రిజిస్ట్రార్ ఈ మధ్య స్థాన చలనం చేయగా అందుకు సమ్మతించని కారణంగా రిజిస్ట్రార్ శివశంకర్  తీవ్ర వేధింపులకు పాల్పడుతూ దుషిస్తూ ఉండగా ఆయన పై ఈ నెల 11 వ తేదీన ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. కేసు నమోదు తర్వాత నుండి తన పై కొందరు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని, కేసు వెనక్కి తీసుకోకపోతే ఇక జీవితమే ఉండదని, నీ అంతు చూస్తాం అంటూ కొంతమంది బెదిరిస్తున్నారని ప్రసాద్ తెలిపారు. తనకు రిజిస్ట్రార్ శివశంకర్ మరియు అతని అనుచరుల నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు కొందరు ప్రసాద్ కు ఫోన్ చేసి యూనివర్సిటీ లో ఎంక్వయిరీ కమిటీ పడింది, నువ్వు నీ సాక్ష్యుల్ని తీసుకుని రా అని ఫోన్ లో హుకుం జారీ చేసారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసు విచారణ పోలీసుల ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలోజరుగుతుందని తనకు తెలుసని కానీ వర్శిటీ పాలకమండలి సభ్యులు ఈ రకంగా తప్పుడు సమాచారం చేరవేశారని తెలిపారు. వర్శిటీ లో అనేక సమస్యలు ఉండగా వేటి మీద పోరాడని వీరు ప్రత్యేక శ్రద్ధతో దీని పై అడగడం అనుమానాస్పదంగా ఉందన్నారు. కేసుకి సాక్ష్యంగా ఎవరు నిలబడబోతున్నారో కనుక్కుని వారిని కూడా బెదిరించేందుకు, ప్రలోభ పెట్టేందుకు వర్శిటీ వారు పన్నిన కుట్ర ఇదని ఆరోపించారు. వర్శిటీ రిజిస్ట్రార్ శివశంకర్, పాలకమండలి సభ్యులు కేసును నీరుగార్చేందుకు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కేసును తారుమారు చేయాలని పన్నాగం పన్నిన పాలకమండలి సభ్యుల పై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద చర్యలు చేపట్టాలని కోరుతున్నానన్నారు. ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి పెట్టి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొనారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *