విక్రమ సింహపురి యూనివర్శిటీ అక్రమాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్
November 14, 2016
విక్రమ సింహపురి యూనివర్శిటీ పై గత కొన్నాళ్లుగా వస్తున్న ఆరోపణలపై, అక్కడ జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని అనేక విద్యార్థి సంఘాల నాయకులు పోరాటాలు జరుపుతున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రార్ ఆచార్య పీఆర్. శివశంకర్ అక్రమాలకు కారణం అవుతున్నారని అనేక ఆరోపణలున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాల వారు అనేక దఫాలుగా పోరాడినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాగా ఇప్పుడు యూనివర్సిటీ మూలంగా జిల్లా విద్యార్థులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అని గుర్తించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి లోకానికి అండగా నేనున్నానంటూ ముందుకొచ్చారు. వర్శిటీలో జరుగుతున్న వివిధ రకాల వ్యవహారాలపై అక్రమాలు జరుగుతున్నాయని ఉన్న ఆరోపణలపై, రిజిస్ట్రార్ శివశంకర్ వ్యవహారశైలి పై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే సీరియస్ అవుతూ మొదటి అడుగుగా వీటిపై విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వర్శిటీ వైస్-ఛాన్సెలర్ వి.వీరయ్యకి సమగ్ర దర్యాప్తు కోరుతూ లేఖలు వ్రాసారు.
విక్రమ సింహపురి యూనివర్శిటీలో నియామకాల్లో అక్రమాలు, భవన నిర్మాణాల్లో అక్రమాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాల్లో అక్రమాలు, కాంట్రాక్టు అధ్యాపకులపై రిజిస్ట్రార్ కక్ష సాధింపు చర్యలు, ప్రైవేటు కళాశాలలకు లభ్ది చేకూర్చేలా వర్శిటీ కళాశాల విద్యార్థులను అకారణంగా ఫెయిల్ చేయడం ఇలా అనేక విషయాల్లో తీవ్ర ఆరోపణలున్నాయి. వీటిపై గత ఎన్నోన్నాళ్ళుగా అనేక విద్యార్థి సంఘాలు పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యవహారంపై ఆలోచించిన సందర్భాలు లేవు.
ఇటీవల వర్శిటీ రిజిస్ట్రార్ శివశంకర్ పై ఆరోపణలు తీవ్రతరం దాల్చాయి. వర్శిటీ లో చదివే పరిశోధక విద్యార్థి జాతీయ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకుంటే కల్లబొల్లి కారణాలతో సరైన ఆధారాలు లేకుండా అతని దరఖాస్తు పంపకుండా అడ్డుకోగా అతను వర్శిటీ పరిపాలనా భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంట్రాక్టు అధ్యాపకుల విధులను రెన్యువల్ చేయకుండా రిజిస్ట్రార్ కక్షపూరితంగా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. కోర్టు కేసులతో కాలం గడుస్తూ వర్శిటీ గెస్ట్ ఫ్యాకల్టీతో నడిచే దుస్థితికి చేరుకుంది. వర్శిటీ కళాశాలలో చేరే విద్యార్థులు కరువయ్యారు. యూ.జి.సి. నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న అధ్యాపకులందరినీ కొనసాగించండని హై కోర్టు తీర్పు వెలువరించగా ఎం.బి.ఏ డిపార్టుమెంటులో అర్హతలు ఉన్నవారిని విధుల్లో కొనసాగించకుండా అర్హతలు లేని వారిని తనకు బాగా కావాల్సిన వారని అక్రమంగా గెస్ట్ ఫాకల్టీ గానే కొనసాగిస్తున్నారు రిజిస్ట్రార్ శివశంకర్. వారిలో ఓ అధ్యాపకురాలు వేరే కళాశాలలో ఎం.బి.ఏ. చదువుతూ ఇక్కడ జీతం తీసుకుంటూ నేరానికి కూడా పాల్పడింది. ఆమె పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధ్యాపకురాలిగానే కొనసాగిస్తున్నారు రిజిస్ట్రార్ శివశంకర్. వర్శిటీ లో ప్రభుత్వం నుండి ఏడాదికి 40 లక్షల రూపాయలు నిధులు పొందే టూరిజం మేనేజ్ మెంట్ విభాగంలో విద్యార్థి చేరినా కూడా పాఠాలు ప్రారంభించకుండా విభాగాన్ని మూసేసాం, నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో పో అని తేల్చిచెప్పారు వర్శిటీ అధికారులు. అదేవిధంగా ఇటీవల వర్శిటీ లో పని చేసే దళిత ఉద్యోగి అయిన శాశ్వత డ్రైవర్ ఆములూరు ప్రసాద్ రిజిస్ట్రార్ శివశంకర్ తనను వేధిస్తున్నారని, అవమానించారని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనకు రిజిస్ట్రార్ మరియు అతని అనుచరుల నుండి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణహాని ఉన్నదని రక్షణ కావాలని ఓ సమావేశంలో తెలియపరిచారు.
ఈ నేపథ్యంలో వర్శిటీ వ్యవహారాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గవర్నర్, ముఖ్యమంత్రులకు లేఖ వ్రాయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమస్యలు తీరే వరకు అలుపెరుగని పోరాటం జరిపే కోటంరెడ్డి వర్శిటీ అక్రమాలను రూపుమాపాలని అడుగేయడంతో జిల్లా విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. తమ సమస్యలను భుజానికి ఎత్తుకుని పరిష్కారం దిశగా పోరాడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డిపై వర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకుని వర్శిటీ పరిపాలన ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.