మైనారిటీ జాబ్ మేళాకు విశేష స్పందన
November 7, 2016
ఆదివారం నెల్లూరు మినీబైపాస్ రోడ్డులో గల వేళాంగిణి భవన్ లో నిర్వహించిన జాబ్ మేళాకు విశేషస్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుండి మొత్తం 1210 మంది అభ్యర్థులు హాజరు కాగా 590 మంది ఉద్యోగాలకు హాజరయ్యారు. 305 మందికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందించగా మిగిలిన 285 మందికి కంపెనీల నిబంధనలకు అనుగుణంగా అంగీకార పత్రాలు తీసుకుని నియామక పత్రాలు అందిస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మెన్ హిదాయత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం లో మైనారిటీల అభివృద్ధికి 310 కోట్లు కేటాయించగా తెలుగుదేశం ప్రభుత్వం నూతన రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే 710 కోట్లు కేటాయించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనారిటీ సంక్షేమం పై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు. మైనారిటీ వైస్-ఛైర్మెన్ పీ ఉషారాణి మాట్లాడుతూ లా కోర్సు పూర్తి చేసిన వారికి న్యాయ పరిపాలనలో శిక్షణను అందిస్తున్నామని అన్నారు. విదేశీ విద్య పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 10 లక్షల రూపాయల గ్రాంటు ఇవ్వడంజరుగుతుందని తెలిపారు. పోటీ పరీక్షలకు సైతం ఉచిత శిక్షణను ఇస్తున్నామని కార్పొరేషన్ ను సంప్రదించాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఏ.ఎం.డి. ఇంతియాజ్, మైనారిటీ కార్పొరేషన్ జీఎం లియాఖరత్ అలీ, డైరెక్టర్లు లాల్ వజీర్, సఫదార్, ఈడీ షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.