ముస్లిం మైనారిటీల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరిద్దాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి
February 3, 2017
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27 వ డివిజన్ జ్యోతినగర్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం నాడు ప్రజాబాట నిర్వహించి ప్రజా సమస్యలను చర్చించి అధికారులకు పరిష్కారం దిశగా సూచనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి ముస్లింలు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వద్ద స్మశాన వాటికకు సంబంధించిన సమస్యను తెలిపారు. స్మశాన వాటికకు తూర్పు, తూర్పు వైపు ప్రహరీ గోడ లేకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందిస్తూ 24 గంటల్లో ప్రహరీ గోడల నిర్మాణాన్ని ప్రారంభించి 20 రోజుల్లో పూర్తి చేయిస్తామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. స్మశాన వాటికలనేవి మరణించిన పెద్దలు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలని, ఏదోక రోజూ ప్రతి ఒక్కరూ శాశ్వత విశ్రాంతి తీసుకోవాల్సిన స్మశాన వాటికల్లో కనీస వసతులు లేకపోవడం తనను బాధిస్తున్నదని అన్నారు. ప్రభుత్వం, ఎంపీ గ్రాంటు లేదా స్నేహితుల, దాతల వద్ద నుండి విరాళాలు సేకరించైనా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడికక్కడ స్మశాన వాటికలను అభివృద్ధి పరుస్తామని, ఈ ఆధునీకరణకు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని కోరారు.
తమ సమస్యలను తక్షణ పరిష్కారం దిశగా చొరవ చూపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి కి స్థానిక ముస్లిం పెద్దలు తమ అభినందనలు తెలియజేసారు.