మీ స్వార్థం కోసం ప్రజల్ని బిచ్చగాళ్ళను చేస్తారా మోడీ అని ప్రశ్నించిన కాంగ్రెస్
November 23, 2016
నగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మంగళవారం పర్యటించారు. ఆయన పర్యటనలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. బృందావనం లోని ఆంధ్రాబ్యాంక్ నెల్లూరు మెయిన్ బ్రాంచ్ కు చేరుకొని ప్రధాని మోడీ దేశాన్ని కష్టకాలంలోకి నెట్టేశారంటూ, ప్రజలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి కష్టమైన పరిస్థితిని ఎన్నడూ పొందలేదంటూ ధర్నా చేసారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రధాని తన అనాలోచిత నిర్ణయం కారణంగా దేశాన్ని వందేళ్ల వెనక్కి నెట్టేశారన్నారు. ప్రజలందరూ బ్యాంకుల ముందు బిచ్చగాళ్లలా మారిపోయారని, పోనీ ఓ 2000 నోటు తెచ్చుకుంటే చిల్లర దొరక్క అడుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. కేవలం కొంతమంది బడాబాబులను రక్షించేందుకే సామాన్యులను కష్టాలలోకి నెట్టేసేలా బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఆడపడుచులు ఇళ్ళు వదిలి బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, తమ డబ్బును తాము తీసుకునేందుకు కూడా గంటల తరబడి క్యూలలో నిల్చోవాలా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అనంతరం ఇందిరాభవన్ లో జరిగిన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి రూపొందించిన ‘కరెన్సీ కష్టాలు’ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. సమైక్యాంధ్ర రాష్ట్ర జేఏసీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు కృష్ణాయాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సీవీ శేషారెడ్డి, ఉపాధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెంచలబాబు యాదవ్, పార్టీ జిల్లా కార్యదర్శి బాల సుధాకర్, ఉపాధ్యక్షులు పత్తి సీతారాంబాబు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.