మళ్ళీ వస్తా… అభివృద్ధిని చూస్తా: సచిన్ టెండూల్కర్
November 17, 2016
తాను దత్తత తీసుకున్న గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతున్నదని, ఇంకా అభివృద్ధి చేస్తా ఆ అభివృద్ధినంతా కళ్ళారా వీక్షిస్తానని భారత క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ రమేష్ టెండూల్కర్ తెలియజేసారు. రెండేళ్ల తర్వాత మరలా గ్రామానికి విచ్చేసిన సచిన్ అక్కడ 1.15 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఆ భవనంలోనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో తాను మరలా మీ ఇంటికి వస్తాను అని మాటిచ్చిన విజయమ్మ ఇంటికి చేరి టీ స్వీకరించారు. అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకొని అక్కడి విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేసారు. సభను ప్రారంభించి గ్రామస్థులను ఉద్దేశించి గ్రామాభివృద్ధి పై ప్రసంగించారు. పలువురు గ్రామస్థులతో సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో రూ.2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నెల్లూరు పంచాయితీ గొల్లపల్లి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.90లక్షలను మంజూరు చేస్తున్నట్లు సచిన్ తెలిపారు. పీ ఆర్ కండ్రిగ బహిరంగ మల విసర్జ రహిత (ఓడీఎఫ్) గ్రామంగా మారడం సంతోషాన్ని కల్గించిందన్నారు. గ్రామంలోని 150 మంది యువకులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేందుకు సచిన్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు సచిన్ ను ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాలరాజు, జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్యే సునీల్‌కుమార్, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.