పూర్తైన నిషిత్ అంత్యక్రియలు
May 11, 2017
హైదరాబాద్ లో బుధవారం వేకువజామున వాహనంలో అతివేగంగా ప్రయాణిస్తూ ఘోరప్రమదానికి గురై దుర్మరణం పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డా|| పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు గురువారం నెల్లూరులో జరిగాయి.
బుధవారం రాత్రికి నెల్లూరు లోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న నారాయణ స్వగృహానికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో చేరుకున్న మృతదేహాన్ని చూసి నారాయణ కుటుంబసభ్యులు భోరున విలపించారు. లండన్ లో అధికారిక వ్యవహారాలను రద్దు చేసుకుని బయల్దేరిన నారాయణ బుధవారం అర్థరాత్రికి నెల్లూరు చేరుకొని కుమారుని మృతదేహాన్ని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన వియ్యంకులు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన్ని ఓదార్చారు.
గురువారం ఉదయం నారాయణ మెడికల్ కళాశాల నుండి పెన్నా తీరాన బోడిగాడితోట స్మశాన వాటిక వద్దకు అంతిమ యాత్ర సాగింది. అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, పార్టీలకు అతీతంగా జిల్లాలోని అందరు రాజకీయ నాయకులు, నారాయణ ఉద్యోగులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.