నోట్ల రద్దుతో కాశ్మీర్ ప్రశాంతం

పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన దాఖలాలు కనిపించకుండా పోయాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు తెలిపారు. ‘‘ఇంతకు ముందు రేట్లు కట్టి మరీ ముష్కర మూకలు అల్లర్లు సృష్టించాయి. సైనిక దళాలపై రాళ్లు రువ్వినందుకు రూ.500, మరేదయినా చేసినందుకు రూ.1000 వరకూ ఆశచూపించారు. తీవ్రవాద చర్యలను ప్రేరేపించే ఇటువంటి టెర్రర్ ఫండ్స్‌ను ప్రధాని మోడీ సున్నాకి తీసుకొచ్చారు’’ అని రక్షణ మంత్రి వెల్లడించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పారికర్.. ‘‘ సరిహద్దు భద్రత కావచ్చు… ఆర్ధిక భద్రత కావచ్చు… ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రత విషయంలో ఎటువంటిదైనా కావచ్చు.. దానికోసం సరిహద్దుల్లో ఉండి మన సైనికులు పోరాడుతున్నారు.. నేను, ప్రధానమంత్రి భద్రతకు భరోసానిస్తున్నామంతే…’’ అని పేర్కొన్నారు. కాగా ఇదే విషయాన్ని మంగళవారం ఉదయం కేంద్ర హోంశాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. రూ.500, రూ.1000 నోట్ల రద్ద తర్వాత కాశ్మీర్ లోయలో హింసాత్మక ఘటనలు గణనీయంగా క్షీణించాయని వెల్లడించింది. కాశ్మీర్ లోయలో హింస వైపు యువకులను ప్రేరేపించేందుకు వేర్పాటువాద సంస్థలు పెద్ద ఎత్తున నకిలీ నోట్లను పంపిణీ చేస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని పెషావర్‌లో దొంగనోట్లు ప్రత్యేకించి రూ.500, రూ.1000 నోట్లు ముద్రించి దేశంలోకి తరలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు నిఘా వర్గాలు నివేదిక సైతం అందించాయి. ఈ వ్యవహారం మొత్తం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లోనే జరుగుతోందనీ… నకిలీ కరెన్సీని చలామణీలోకి తెచ్చేందుకు దావూద్ ఇబ్రహీం, ఎల్‌ఈటీ సహా అంతర్జాతీయ క్రిమినల్ ముఠాలను ఉపయోగించుకుంటోందనీ నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. నకిలీ నోట్లను అచ్చం భారత్‌లాగే ముద్రించేందుకు పాకిస్తాన్ వద్ద ప్రత్యేక ముద్రణా పరికరాలున్నట్టు తెలిపింది. అయితే ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం నూతన కరెన్సీ నోట్లను అమల్లోకి తెచ్చింది. పాకిస్తాన్, తీవ్రవాద సంస్థలు వీటిని ముద్రించడం సాధ్యమయ్యే పనికాదని రా, డీఆర్ఐ నిఘా సంస్థల అధికారులు చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *