నెల్లూరు యూనివర్శిటీ విద్యార్ధుల పవన్ కళ్యాణ్ వద్దకు పాదయాత్ర ప్రారంభం

వాళ్ళంతా విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని నెల్లూరు జిల్లా విద్యార్ధులు. కొందరు వర్శిటీ కళాశాలలో విద్యార్ధులు, కొందరు పరిశోధక విద్యార్ధులు, కొందరు అనుబంధ కళాశాలలకు చెందిన వారు. వారి ఆశ ఒక్కటే. జిల్లా యూనివర్సిటీ అవినీతి అక్రమాలతో నాశనం కాకుండా రక్షించాలి, జిల్లా విద్యావ్యవస్థని కాపాడుకోవాలి. తాము ఈ అక్రమాల కారణంగా, ప్రభుత్వం పట్టించుకోని తీరు కారణంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నది గుర్తించి భవిష్యత్తు తరాలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని తలచి కష్టసాధ్యమైనా కాని పోరాట స్ఫూర్తితో నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసేంత కఠిన నిర్ణయానికి వచ్చారు.

పోరాటం ఈ అక్రమాల పై:

విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరిగిన, జరుగుతున్న అనేక అక్రమాలు, అవినీతి, అపరిష్కృతంగా ఉన్న విద్యార్ధుల సమస్యలు, అద్దె భవనాల్లోనే కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితులు, నాణ్యతా ప్రమాణాల తనిఖీలు లేకుండా నాసిరకంగా నిర్మించి రెండేళ్ళు పూర్తైనా ఇంకా ప్రారంభం కాని వర్శిటీ భవనాలు, బోధన బోధనేతర నియామకాల్లో అక్రమాలు, పలు రెగ్యులర్ కోర్సుల మూసివేత, హాస్టల్ విద్యార్ధుల కష్టాలు, అవినీతికి కేంద్రబిందువైన రిజిస్ట్రార్ శివశంకర్ ను తొలగించకుండా రెండేళ్లకు పైగా కొనసాగిస్తున్న విధానం, వర్శిటీ విద్యార్ధులు మరియు సిబ్బంది పై అధికారుల కక్ష పూరిత వేధింపులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు, వర్శిటీ కళాశాలలో విద్యార్ధులు చేరకుండా కళాశాలను నాశనం చేసేసిన తీరు, అంతర్గత రాజకీయాలు తదితర అంశాలపై అనేకనాళ్లుగా పోరాటాలు జరుగుతున్నా దర్యాప్తులు జరిపించి అక్రమాలను నిరోధించకుండా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్త పరుస్తూ విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధి సమాఖ్య అధ్వర్యంలో వర్శిటీ పరిధిలోని పలువురు విద్యార్ధులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహాయార్ధం ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్ళి ప్రభుత్వంలో చలనం కలిగేలా చేసి జిల్లా విద్యా వ్యవస్థను కాపాడాలని కోరుతూ నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి పవన్ కళ్యాణ్ ని కలిసి విన్నవించదలచి బుధవారం పాదయాత్రను ప్రారంభించారు.

పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్ధులు:

నెల్లూరు నుండి హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్ వద్దకు నెల్లూరు వర్శిటీ పరిధిలోని జొన్నలగడ్డ సుధీర్, గంగిరెడ్డి, మల్లి శ్రీకాంత్ యాదవ్, కిరణ్, వినయ్, శ్రీనివాసులు, సాయి వినయ్ కుమార్ రెడ్డి, చెంచు రామానాయుడు, ప్రేమ సాయి, వెంకటేష్ గౌడ్, వైభవ్, రాజేష్, గణేష్ తదితర విద్యార్ధులు పాదయాత్రగా బయలుదేరారు.

పాదయాత్ర ప్రారంభం ఇలా:

తొలుత వర్శిటీ కళాశాల విద్యార్ధులు పాదయాత్రకు వెళ్ళు విద్యార్ధులకు మద్దతుగా వర్శిటీ కళాశాలలో నుండి వస్తుండగా వర్శిటీ అవినీతి అధికారులు విద్యార్ధులను అడ్డుకున్నారు. వెళ్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రిన్సిపాల్ వెంకటరావు మరియు కొందరు అధ్యాపకులు విద్యార్ధులను భయభ్రాంతులకు గురిచేసారు. పవన్ కళ్యాణ్ వద్దకు ఏంటి వెళ్ళేది అని ఎబివిపి వర్శిటీ ఇన్ ఛార్జ్ సాంబశివారెడ్డి  మరియు కార్యకర్తలు పాదయాత్ర కు పోవు విద్యార్ధులతో గొడవకు దిగారు. వర్శిటీ కళాశాల విద్యార్ధులు మద్దతు వెళ్ళకుండా అడ్డుకున్నారు. కళాశాల వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. 
అయినా విద్యార్ధులు బెదరక తమ పాదయాత్రను కొనసాగించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరి విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని అటునుండి గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నం నెల్లూరు నగరం దాటి  పడుగుపాడు వద్ద చింతాలమ్మ దేవస్థానంలో భోజనం చేసుకుని విశ్రాంతి తీసుకుని పాదయాత్రను కొనసాగించారు.

సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి:

విద్యార్ధుల పాదయాత్రకు సంఘీభావంగా విచ్చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు నెల్లూరు నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేసేంత కఠిన నిర్ణయానికి వచ్చారంటే పరిస్థితి తీవ్రత, వర్శిటీ లో అక్రమాలు ఏవిధంగా విద్యార్ధులకు సమస్యలను సృష్టిస్తున్నాయో అర్థమవుతున్నదని, ప్రభుత్వానికి విజ్ఞత ఉంటే తక్షణం వర్శిటీ లో అక్రమాల ఏరివేత చర్యలకు దిగాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్ధులకు పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సైతం విద్యార్ధుల బాధను సహృద్భావంతో అర్థం చేసుకుని సమస్య పరిష్కారం దిశగా విద్యార్ధులకు సాయపడుతారని ఆశిస్తున్నామని తెలిపారు.

మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం, చిరంజీవి యువత:

పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకులు టోని, మురళి, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కొట్టే వెంకటేశ్వర్లు, పవన్ కళ్యాణ్ యువత నాయకులు విద్యార్ధుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి తోడ్పడతామని తెలిపారు.

ఎస్ఎఫ్ఐ, విద్యార్ధి జెఎసిల మద్దతు:

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాయుడు రవి, ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాయి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్ధి జెఎసి కన్వీనర్ అంజయ్య తదితరులు విద్యార్ధులకు మద్దతు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు పుస్తక రూపంలో వినతి పత్రం:

విద్యార్ధులు గత కొన్నేళ్లుగా వర్శిటీ లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలను తమకు తెలిసిన మేర శోధించి 12 పేజీలలో ముద్రించారు. పలు పత్రికల్లో వచ్చిన వర్శిటీ అక్రమాల ప్రత్యేక కథనాలను జతపరుస్తూ వినతిని పుస్తక రూపంలో పొందుపరచారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *