నెల్లూరులో ఇప్పుడు కుదిరితే కప్పు ఇరానీ టీ
December 9, 2016
టీ కేఫ్ అంటే సిగరెట్ కొట్టడానికే అనేలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కాలానుగుణంగా పరిస్థితులు మారాయి. టీ కేఫ్ ల మాటున గుప్పు గుప్పు మంటూ సిగరెట్ కొట్టే రోజులు నెల్లూరు నగరంలో క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఆ టీ కొట్టుల స్థానంలో ఇప్పుడు ఇరానీ కేఫ్ లు దర్శనమిస్తున్నాయి. ఈ కేఫ్ లు పొగ త్రాగడానికి దూరం కావడం వీటి ప్రత్యేకత. వీటిల్లో సిగరెట్ లు అమ్మరు. సమోసా, బిస్కెట్…. ఓ కప్పు ఇరానీ ఛాయ్, ఇదీ ఈ కేఫ్ లలో కల్చర్. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులకు సమయం దొరకడం లేదు. దొరికినా కాసేపు ప్రశాంతంగా ఓ చోట చేరి కబుర్లాడే ప్రదేశాలు మన నెల్లూరులో అతి తక్కువ. ఈ క్రమంలో గత కొద్ది కాలంగా నగరంలో ఈ ఇరానీ ఛాయ్ కేఫ్ ల కల్చర్ పెరిగింది. కాసేపు కలిసి సంభాషించుకోవాలనే వారికి ఇవి టైమ్ పాస్ కేంద్రాలుగా మారుతున్నాయి. కళాశాలల విద్యార్థులకు, ఏదైనా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు తమ విశ్రాంతి సమయాల్లో లేదా పని వేళలు పూర్తైన తర్వాత ఈ కేఫ్ లే బాతాఖానీ సెంటర్లుగా మారుతున్నాయి. రుచికరమైన టీ తో పాటు కాఫీ, సమోసా, బిస్కెట్స్, పఫ్స్, కేక్స్, కూల్ కేక్స్ కూడా పలు కేఫ్ లలో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఈ కేఫ్ లకు నగర ప్రజల నుండి ఆదరణ రోజురోజుకీ పెరుగుతున్నది. ఓ కప్పు టీ రూ.10/- అయినా కూడా ఖర్చుకు వెనకాడట్లేదు నగరీయులు. ఎక్కడ రుచికరమైన టీ లభిస్తే అక్కడికి పలువురు ఛలో అంటూ అదో పనిలా చేరుకొని ఆ రుచిని ఆస్వాదిస్తూ సేదదీరి కబుర్లలో మునిగిపోతుండటంతో ఈ వ్యాపారం ఈ కేఫ్ ల నిర్వాహకులకు కాసుల పంటగా మారింది. నగరంలోని ఇస్కాన్ సిటీ అన్నమయ్య సర్కిల్, కృష్ణచైతన్య కళాశాల వద్ద, కనకమహల్ సెంటర్, అపోలో ఆసుపత్రి వద్ద, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, చిన్నబజారు ఇలా అనేక జన సామర్ధ్యం కల్గిన ప్రదేశాల్లో ఇప్పుడు ఈ కేఫ్ లే బిజీ వ్యాపార కేంద్రాలు. విస్తృత స్థాయిలో ప్రజలు ఆదరిస్తున్న ఈ కేఫ్ లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న వరకూ బాగానే ఉంటుంది. గతంలో హైదరాబాద్ మహానగరంలో ఇరానీ ఛాయ్ లలో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూశాయి. కనుక ఆరోగ్య శాఖ అధికారులు తరచుగా ఈ కేఫ్ లలో సైతం తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది.