నగర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్న మేయర్ అజీజ్
February 10, 2017
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సెల్ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ సందర్శించారు.
ఈ సందర్భంగా మేయర్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్మార్ట్ సిటీలను ప్రణాలికా బద్ధంగా అభివృద్ది చేసేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ సెల్ సహకారంతో నగరాభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. నెల్లూరు నగరాన్నిస్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నెల్లూరుతో పాటు అనంతపురం, కర్నూలు, ఏలూరు, శ్రీకాకుళం, ఒంగోలు నగరాల్లో ప్రాజెక్టును ప్రారంభించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. రాబోవు 10 సంవత్సరాల్లో నగర ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్న అంశాలపై సంస్థ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా రూ.33 కోట్లు మంజూరు చేస్తుందనీ, ఆ మొత్తంతో నగారాభివృద్ధికి అవసరమైన ప్రణాలికలు సిద్ధం చేస్తామని తెలిపారు. 3 సంవత్సరాలపాటు మంజూరయ్యే ఆ నిధులకు సమానంగా కార్పోరేషన్ కూడా నిధులను వెచ్చిస్తూ అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని వివరించారు.
వాట్సప్, ట్విటర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలతో ప్రజాభిప్రాయాలను సేకరిస్తామని నెల్లూరు స్మార్ట్ సిటీ సెల్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ మేనేజర్ గిరిజ, నెల్లూరు స్మార్ట్ సిటీ సెల్ సంస్థ ప్రతినిధులు రూపారాణి, నాగేంద్ర, వాసవి, కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు, టి.డి.పి నాయకులు నన్నేసాహేబ్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.