జిల్లాలో బంద్, ధర్నాలకు, ర్యాలీలకు, బహిరంగ సభలకు పోలీసుల అనుమతి తప్పనిసరి: ఎస్పీ విశాల్
November 21, 2016
ఈ మధ్యకాలంలో నగరంలోని వివిధ కూడళ్ళలో పలు యువజన, విద్యార్ధి, ప్రజా సంఘాల ధర్నాలు, ర్యాలీలు సాధారణం అయిపోయాయి. ఈ క్రమంలో అటు ట్రాఫిక్, ఇటు శాంతి భద్రతలకు కొన్ని సమయాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా వ్యక్తులు కాని, సంస్థలు కాని ఏదైనా బంద్, రాస్తారోకో, ర్యాలీ, దీక్ష, బహిరంగ సభ, పాదయాత్ర లాంటివి తలపెట్టదలచిన పక్షంలో సంబంధిత ప్రాంత డీఎస్పీ నుండి అనుమతి పత్రం పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా ఎవరైనా ఏ ఆందోళన కార్యక్రమం చేపట్టదలచుకున్నా వారు చేపట్టే కార్యక్రమం వివరాలు తెల్పుతూ, ఎంతమంది హాజరవుతున్నారు, కీలక బాధ్యతా నేతలు ఎవరనే వివరాలు తెలియజేస్తూ శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కల్గకుండా కార్యక్రమం చేపడుతాం అనే డిక్లరేషన్ ఇస్తూ డీఎస్పీ నుండి అనుమతి పొందాలని ఎస్పీ తెలిపారు. ఈ నిబంధనలను కాదని ఎవరైనా వ్యవహరించినా, శాంతి భద్రతల విఘాతం కల్గినా, జరిగిన నష్టానికి నష్ట పరిహారం వసూలు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.