చెన్నైలో నెల్లూరు వాసి అవయవదానం
November 7, 2016
సంగం మండలం పడమటిపాళెం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి(32) దురదృష్టవశాత్తు గత శుక్రవారం ద్విచక్ర వాహనంలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా మియాట్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ కు గురైనట్టు పేర్కొన్న వైద్యులు కుటుంబసభ్యులను అవయవదానంకు ఒప్పించి అవయవాలను సేకరించారు.
పై చిత్రంలో తల్లి భూదేవమ్మ, తండ్రి కృష్ణారెడ్డి లతో కలిసి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పూణే లో ఉద్యోగం చేస్తుండేవారు. ఈయనకు ఏడాది క్రితం కొడవలూరు మండలం పెయ్యలపాలెం గ్రామానికి చెందిన అనూషతో వివాహం అయింది. వీరికి రెండు నెల పాప. ఆదివారం కుమార్తెకు నామకరణం చేయించాలని ఈయన పూణే నుండి సొంత గ్రామానికి గత వారం వచ్చారు. శుక్రవారం పెయ్యలపాలెంలో ఉన్న అత్తగారింటికి వెళ్లి తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఈయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేరే వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు హుటాహుటిన 108 వాహనానికి సమాచారం అందించి నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. మాటాపలుకు లేకుండా ఉన్న కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు.
కిరణ్ కుమార్ రెడ్డి శరీరం నుండి వైద్యులు రెండు కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించి వివిధ వైద్యశాలలకు తరలించారు. అవయవాలు ఎవరికి అమర్చారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచారు.
ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి కిరణ్ కుమార్ రెడ్డి మృతదేహం చేరడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లిదండుల బాధను చూసిన ప్రతిఒక్కరికి గుండె తరుక్కుపోయింది. పూణే నుండి రాకుండా ఉన్నా తమ బిడ్డ తమకు దక్కేవాడని వారు చేస్తున్న రోదన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. తన అవయవదానంతో అమరుడైన కిరణ్ కుమార్ రెడ్డికి పలువురు జోహార్లు తెల్పుతూ తుది వీడ్కోలు పలికారు.