క్యాట్ స్కోరర్ హేమాక్షర్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభినందన సత్కారం
January 13, 2017
ప్రతి విద్యార్ధి ఇష్టపడి, కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో ఎంబిఎ ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్ పరీక్షలో 99.94 పాయింట్ లతో రాష్ట్రంలోనే అత్యుత్తమ స్కోర్ సాధించి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్ ఐఐఎంలో సీటును సాధించిన హేమాక్షర్ ను ఎమ్మెల్యే గురువారం నాడు 37వ డివిజన్ సరస్వతి నగర్ లోని అతని ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించి శాలువా, పూల బోకేతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలలో స్ఫూర్తిగా నిలిచేలా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన హేమాక్షర్ ను విద్యార్ధులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హేమాక్షర్ కు హై స్కూల్, ఇంటర్ విద్య నందు ప్రోత్సహించి ఉచిత విద్యను అందించిన రత్నం విద్యాసంస్థల అధినేత డా|| కిషోర్ రత్నాన్ని కూడా ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్ధికి ఎల్లవేళలా తమ తోడ్పాటును అందించి తీర్చిదిద్దిన తల్లిదండ్రులు కోటా దయానంద్, షీలా రాణి దంపతులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ నగర యువజన ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా యువజన కార్యదర్శి హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.