అభయ గోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందా? – పూర్తయిన దర్యాప్తు
November 8, 2016
రాష్ట్ర వ్యాప్తంగా 221 కోట్ల రూపాయలను ప్రజల నుండి సేకరించిన అభయ గోల్డ్ కేసు దర్యాప్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. పదేళ్ల క్రిందట ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించింది. ప్రజల నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టుకుని వందలాది ఏజంట్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆకర్షణీయంగా ప్రచారం చేస్తుండడంతో అనేక మంది పేద వాళ్ళు ఈ సంస్థలో తాము సంపాదించిన సొమ్మును పెట్టి తీవ్రంగా నష్టపోయారు. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 2008 వ సంవత్సరంలో ఈ సంస్థ భాగోతం పై మొదటి సారిగా నెల్లూరు నగర 5 వ పట్టణ, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 కి పైగా కేసులు నమోదయ్యాయి. అప్పటి నుండి విచారణ జరుగుతుండగా 2013 లో ఈ కేసును సీఐడీ కి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు సుమారు మూడేళ్ళ పాటు అన్ని జిల్లాల్లో బాధితుల నుండి వివరాలు సేకరించారు. సోమవారం కోర్టులో పది వేల పేజీలతో ఛార్జి షీట్ దాఖలుచేసారు . జిల్లాలో సుమారు 50 వేల మంది అభయ గోల్డ్ బాధితులు ఉన్నట్లు అంచనా. సుమారు 50 కోట్ల రూపాయల మేర మన జిల్లా నుండి సంస్థ సేకరించడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో 18.82 ఎకరాలను అధికారులు సీజ్ చేసారు. అలానే జిల్లా కేంద్రం లోని కార్యాలయంతో పాటు ఒక కారు, కంప్యూటర్లు, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన ఆస్తుల ద్వారా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.