అధ్వాన్న పారిశుద్ధ్యానికి రాజధాని నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
January 10, 2017
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 29 వ డివిజన్ లో మంగళవారం ప్రజాబాటను నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరం అధ్వాన్న పారిశుద్ధ్యానికి రాజధానిగా మారిందని, సరైన పారిశుద్ధ్య సదుపాయాలు లేకుండా పారిశుద్ధ్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సైనికులకు సరైన ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధానికి పంపితే ఎలా ఉంటుందో సరైన సదుపాయాలు లేని పారిశుద్ధ్యం పరిస్థితి కూడా అలానే మారిందని దుయ్యబట్టారు. పారిశుద్ధ్యానికి సంబంధించి నగరంలో అతి కొద్ది సిబ్బంది, సామాగ్రి, వాహనాలు మాత్రమే ఉన్నాయని వాటిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని, అప్పుడే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ నెల్లూరు సాధ్యమని తెలిపారు. ఉన్న కొద్ది మంది పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో పనిచేస్తున్నారని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఎంపీ నిధులు మరియు నగరపాలక సంస్థ సహకారంతో త్వరలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు డివిజన్ వైసీపీ కమిటీ అందించిన దుప్పట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ 29 డివిజన్ ఇన్ ఛార్జ్ చెక్కా సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు.