నెల్లూరు హైవే పై మరణాలు తగ్గాలంటే ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు నిర్మించేలా పోరాటం జరుపుతామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
November 12, 2016
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించి నెల్లూరు నగరంలో రహదారుల భద్రతకు, రహదారులపై మరణాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలియజేసారు. జాతీయ హైవే పై బుజబుజ నెల్లూరు జంక్షన్, గొలగమూడి జంక్షన్, ఎన్టీఆర్ నగర్ – రాజుపాళెం జంక్షన్, సింహపురి హాస్పిటల్ జంక్షన్ ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు మృత్యువాత పడుతున్నారని తెలియజేసారు. బుజబుజ నెల్లూరు లో అయితే కేవలం 300 మీటర్ల సర్వీస్ రోడ్డు లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ హైవే జోన్లలో ప్రమాదాల నివారణ అవ్వాలంటే జంక్షన్లలో బ్రిడ్జిల నిర్మాణం జరగాలని తెలిపారు. మూడు నెలలుగా ఈ విషయమై పోరాడుతుంటే ఎట్టకేలకు నేషనల్ హైవే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారని తెలిపారు. బ్రిడ్జిల నిర్మాణానికి 80 కోట్లు, బుజబుజ నెల్లూరు రోడ్డుకు 40 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఢిల్లీ పంపారని తెలియజేసారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆమోదించి పనులు ప్రారంభించేలా ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉదృతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కోరారు. జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని కలిసి ఈ విషయమై విజ్ఞాపన పత్రం అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే బ్రిడ్జిల నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని, గతంలో టోల్ గేట్ భూతాన్ని అందరితో కలిసి ఎలా తరిమికొట్టామో ఆ తరహాలో సాధన చేస్తామని దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ జిల్లా కార్యదర్శి మలినేని వెంకయ్య నాయుడు, నగర అధికార ప్రతినిధి గుండాల మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.