జాగ్రత్తగా మెలుగుతూ సంబరాలు చేసుకోండి – మితిమీరితే మీకే నష్టమని స్పష్టం చేసిన నెల్లూరు పోలీస్
December 30, 2016
నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు పోలీసు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 31 సంబరాల్లో పాల్గొనే యువత జాగ్రత్తగా మసలుకోవాలని ఈ సందర్భంగా ఆచరణ నియమావళిని విడుదల చేసారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో సంబరాలు చేసుకునే యువతకు రాత్రి 12 నుండి 1 గంట వరకే అనుమతి ఉన్నదని స్పష్టం చేసారు. సంబరాల్లో భాగంగా ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపినా, మితిమీరిన వేగంతో రాష్ డ్రైవింగ్ చేసినా, బైక్ రేస్ లు జరిపినా, గ్రూపు తగాదాలకు పాల్పడినా, ఈవ్ టీజింగ్ కు పాల్పడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా సహించేది లేదని స్పష్టం చేసారు. నగర పరిధిలో 40 పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు, వీటికి తోడు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా నిరంతరం ఉంటుందని ఎస్పీ విశాల్ గున్ని ఈ సందర్భంగా తెలిపారు.