కమ్మరావతి అని అఫిడవిట్లో ఎందుకు పెట్టలేదు.? : టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు

టీడీపీ హయాంలో 70 శాతం పూర్తి చేసిన పోలవరాన్ని మూడేళ్లలో మూడు శాతం కూడా పూర్తి చేయలేదని, 90 శాతం మేర రాజధానిని నిర్మిస్తే మూడేళ్లుగా నిర్వీర్యం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు విమర్శించారు. రాజధానిపై ముఖ్యమంత్రి కక్ష సాధింపులు ఇంకా తీరలేదని ఒకేసారి లక్ష కోట్లు ఖర్చుపెట్టాలని చేస్తున్న తప్పుడు ప్రచారం ఇంకా మానలేదని మండిపడ్డారు. అమరావతిలో రైతులు ఇచ్చిన భూములతో ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్ల సంపద సమకూరిందని, ఈ సంపదతోనే రాజధాని నిర్మించవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్లుగా కమ్మరావతి, గ్రాఫిక్స్, మునుగుతుంది అని తప్పుడు ప్రచారం చేశారని, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు ప్రచారాలను ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు.

మూడేళ్లుగా మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారం అని కోర్టులో సమర్పించిన ప్రమాణపత్రం ద్వారా మరోమారు రుజువైందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌళిక వసతులు నెల రోజుల్లో పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే వాటిని ధిక్కరించారని, మౌళిక వసతులు పూర్తి చేయడానికి 60 నెలల సమయం కావాలనడం చేతకాని తనం అనుకోవాలా.? రాజధాని పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనుకోవాలా..అని ప్రశ్నించారు. 90 శాతం పనులు టీడీపీ ప్రభుత్వం రాజధానిలో పూర్తి చేసిందన్నారు.

ఐదేళ్లలో రాజధానిని చంద్రబాబు కట్టలేకపోయారు..నేనొస్తే ఆరు నెలల్లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తానని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూడేళ్ల సమయాన్ని వృధా చేసి, ఇప్పుడు ఇంకా సమయం కావాలని అడగడం సిగ్గనిపించడం లేదా.? అని దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను చట్టసభల్లో చులకన చేసి మాట్లాడుతున్నారని చట్టాలు చేయొద్దని కోర్టులు చెప్పలేదన్నారు. ఆ చట్టాలు ప్రజాభీష్టం, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే చెల్లనేరవని చెప్పే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నారు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *