ఎక్కడైనా స్వతహాగా రాజకీయ నాయకులైనా, కొత్తగా చేరేవారైనా వారంతట వారే పార్టీలో చేరతారు. లేదా ఆ నేత రాక ఇష్టం లేకపోతే వద్దు అని నిరసనలు, ర్యాలీలు చేసి వ్యతిరేకించడం చూశాం. కానీ అందుకు భిన్నంగా జనసేన నేతల తీరు. తమ పార్టీలోకి రావాలని ర్యాలీలు నిర్వహించారు. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడా సంఘటన వివరాల్లోకి వెళ్తే. చిత్తూరు జిల్లా నగరిలో సినీనటి వాణీవిశ్వనాథ్ జనసేనలో చేరాలని ఆ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. జనసేనలో చేరి.. నగరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలంటూ బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాణి విశ్వనాథ్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే గెలిపించుకుంటామన్నారు. అయితే ఆమె ఇటీవల నగరిలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుండి పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు.అయితే 2019 ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ఆ పార్టీలో చేరాలనుకున్నారు. అప్పడే నగరి నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు. మూడు సార్లు అమరావతికి కూడా వెళ్లి చంద్రబాబును కలవాలనుకున్నా అపాయింట్‌మెంట్ దొరకలేదు.
అయితే ఈసారి ఏ పార్టీ నుంచి అవకాశం లేకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగాలని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా రోజా ఉన్నారు. టీడీపీ ఇంఛార్జ్ గా గాలి భానుప్రకాశ్ ఉన్నారు. వాణి విశ్వనాథ్ కు టీడీపీ నుంచి కూడా టికెట్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆమె బీజేపీ లేదా జనసేనలో మాత్రమే చేరే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ముందుగానే గ్రహించిన జనసేన నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఎన్నికలకు ముందే రాజకీయ సందడి నగరిలో మొదలైంది.