ప్రతి అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో మూడో విడత సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. చరిత్రలో నిలిచిపోయే అక్క చెల్లమ్మల విజయగాథ, ప్రభుత్వంపై నమ్మకమున్న అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది, సాధికారత సారథులకు అభినందనలు అని మాట్లాడారు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1,258 కోట్లు, రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1,096 కోట్లు, వరుసగా మూడో ఏడాది రూ.1,261 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. కోటి 2 లక్షల 16 వేల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతోంన్నారు. మూడేళ్లలో రూ.3,615 కోట్లు అక్కా చెల్లెమ్మలకు చెల్లింపులు చేశామని, గతంలో 12 శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేదన్నారు.
అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని గత ప్రభుత్వం ఆలోచించలేదననారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయని, గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు రూ.3,036 కోట్లు ఎగనామం పెట్టిందన్నారు. దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల డ్వాక్రా సంఘాలు డి-గ్రేడ్ కు పడిపోయాయని, మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. మన ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు ప్రగతి బాట పట్టాయన్నారు.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిల్ని తీర్చామని వివరించారు. పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన ప్రభుత్వం మనదని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచి చేస్తున్న మన ప్రభుత్వం వద్దట, పేదలకు పథకాలు ఇవ్వొద్దట, ఇక ఆపాలట అని, మా పాలన వద్దని చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నాడని మండిపడ్డారు. పథకాలు ఆపాలంటున్న ఎల్లోమీడియా, ఎల్లో పార్టీ, ఎల్లో దత్తపుత్రుడు మనుషులేనా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.