గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష వేయడాన్ని స్వాగతిస్తున్నానని, గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి రోజా అన్నారు. దిశ స్ఫూర్తితో రమ్య హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు, ఐదు రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసి, త్వరితగతిన విచారణ జరిగే విధంగా, దిశ ప్రత్యేక న్యాయవాదితో వాదనలు వినిపించారని పేర్కొన్నారు. 9 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్షపడేలా చేయడం జగన్ గారి పరిపాలన గొప్పదనమేమని వివరించారు.
దిశచట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే కచ్ఛితంగా తప్పు చేసిన నిందితులను ఉరితీయవచ్చు.. తద్వారా తప్పు చేయాలంటేనే భయం ఉంటుంది, ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని జగన్ చెప్పంది ఈ రోజు అందరికీ అర్థం అయ్యి ఉంటుందని తెలిపారు. మహిళా లోకం అంతా జగనన్నకు జేజేలు పలుకుతుందని ప్రకటించారు. ఇక మీదట ఆడపిల్లలను కన్నెత్తి చూడాలంటేనే, దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. అమ్మాయిలపై దాడి చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందన్నారు.
ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం టీడీపీ చేస్తుందే తప్ప అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు. చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించారా? దిశా లాంటి చట్టాలను తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల రక్షణ గురించి ఆలోచించకుండా.. ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తూ ఆడవారిని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.