Site icon 123Nellore

ఉద్యమమంటే ఉలుకెందుకు జగన్.? : సీపీఐ రామకృష్ణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజా ఉద్యమాలు అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ఉలుకెందుకు అని ప్రశ్నించారరు. సోమవారం సీపీఐ చలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుండే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సీపీఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పెంచిన ఆస్తి, చెత్త పన్నులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇస్టానుసారంగా ఆస్తి పన్ను, మరుగుదొడ్డి పన్నులు వేసి ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, కేంద్రం కూడా విరివిగా అప్పులు ఇచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విచ్చల విడిగా చేసే అప్పులకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయాన్ని పెంచకుండా…అప్పులు చేస్తూ పోతే ప్రజల నెత్తిన పడే భారాన్ని ఎవరు తగ్గిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాధి రూపాయల భారం పడిందని పేర్కొన్నారు.

వంట నూనెల, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై అధిక సుంకాల భారాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాస్ వెయ్యికి పైగా చేరగా తాజాగా..రూ.50 మళ్లీ పెంచారని మండిపడ్డారు. ప్రజలే రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతారని మండిపడ్డారు. అరెస్టు చేసిన సీపీఐ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version