నేను ఉన్నాను..నేను విన్నాను అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగునే మళ్లీ చెప్తే ఎలా అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో పెట్టాల్సింది నీ అయ్య విగ్రహమో… నా అయ్య విగ్రహమో కాదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ హాయాంలో నిర్మించిన నిర్వాసితకాలనీల్లో జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రితోకలిసి పర్యటించాడన్నారు. తన అధికారులకు ముందే ట్రైనింగ్ ఇచ్చి, అంతాతానే చేసినట్టు గిరిజనులతో చెప్పించుకోవాలన్న ముఖ్యమంత్రి ఆశ నిరాశే అయిందన్నారు. అధికారంలోకి వచ్చి 34నెలలు అవుతున్నా, పోలవరం నిర్మాణం పై ఈ ముఖ్యమంత్రి, మంత్రులు పూటకొక అబద్ధం, రోజుకో అసత్యం చెబుతూ కాలయాపనచేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ డిసెంబర్ 2021 నాటికి పూర్తవుతుందని శాసనసభలో, బయటా ఉత్తర కుమారప్రగల్భాలు పలికిన ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని ఎద్దేవా చేశారు. కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వలేని ప్రభుత్వం, ఎంతటిదద్దమ్మ, చేతగాని ప్రభుత్వమో అర్థమవుతోందని, పోలవరం నిర్మాణపనుల్లో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం 350 అడుగుల గోదావరి గర్భంలోకి వెళ్లి మరీ నిర్మా ణం చేపట్టిందన్నారు. దాన్ని రికార్డుస్థాయిలో ఎల్ అండ్ టీ సంస్థ జర్మనీ కి చెందిన బావర్ కంపెనీతో కలిసి పూర్తిచేసిందన్నారు. అలాంటి సంస్థల పనితనం ఈ ముఖ్యమంత్రికి కనిపించడంలేదని వివరించారు.
బహుళార్థసాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి బ్యారేజ్ గా మార్చడానికి కుట్రలుపన్నుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, ఇతరత్రా బ్యూటిఫికేషన్ పనులకోసం ఉపయోగించాల్సిన రూ.300కోట్లతో తనతండ్రి విగ్రహం పెట్టడానికి సిద్ధమయ్యా డని మండిపడ్డారు. సిగ్గులేకుండా టీడీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకోసం నిర్మించిన ఇళ్లను తాము కట్టామని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంపై, నిర్వాసితులకు లక్షలు లక్షలు ఇస్తామని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడెందుకు మాటతప్పాడని ప్రశ్నించారు.